కరీంనగర్ జిల్లా: రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (SEC) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మరియు పోలీస్ కమీషనర్ శ్రీ గౌష్ ఆలం పాల్గొన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ల వివరాలు, భద్రతా ప్రణాళికపై వారు వివరించారు.
◆ నామినేషన్ల వివరాలు వెల్లడించిన కలెక్టర్
కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, రెండు విడతల నామినేషన్ల దాఖలు వివరాలను వెల్లడించారు:
◆ మొదటి విడత:
92 సర్పంచ్ స్థానాలకు గాను 730 నామినేషన్లు దాఖలు.
866 వార్డు సభ్యుల స్థానాలకు గాను 2174 నామినేషన్లు దాఖలు.
◆ రెండవ విడత:
113 సర్పంచ్ స్థానాలకు గాను 888 నామినేషన్లు దాఖలు.
1046 వార్డు సభ్యుల స్థానాలకు గాను 3056 నామినేషన్లు దాఖలు.
◆ ముఖ్య అంశాలు:
సర్పంచ్ లేదా వార్డు మెంబర్ పదవికి నామినేషన్ వేయని గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు నమోదు కాలేదు. సర్పంచ్ పదవికి సింగిల్ నామినేషన్ వేసిన గ్రామ పంచాయతీలు కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. మొత్తం 125 వార్డులకు గాను, సింగిల్ నామినేషన్లు దాఖలైనట్లు నమోదు అయింది.
మొత్తం 2946 పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ అధికారులకు డిసెంబర్ 6, 9, మరియు 12 తేదీల్లో మూడు దశల్లో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల పరిశీలకులు, పోలీస్ కమీషనర్ సమన్వయంతో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు.
◆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, మూడు విడతలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తెలిపారు. తుది డ్రాఫ్ట్ బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.
◆ పోలింగ్ కేంద్రాల వర్గీకరణ:
గతంలో జరిగిన ఘటనల ఆధారంగా మొత్తం పోలింగ్ కేంద్రాలను సాధారణ మరియు సమస్యాత్మక కేంద్రాలుగా విభజించినట్లు తెలిపారు. మొత్తం కేంద్రాలలో 19 శాతం సమస్యాత్మకమైనవిగా గుర్తించి, వాటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
◆ బైండోవర్
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గత ఎన్నికల నేరస్థులు, రౌడీషీటర్లు, భౌతిక దాడులకు పాల్పడిన 635 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు.
◆ఆయుధాలు/కేసులు
ఇప్పటివరకు 70 అక్రమ మద్యం కేసులు మరియు 01 ఎన్.డి.పి.ఎస్. చట్టం కేసు నమోదు అయ్యాయి. 33 లైసెన్స్ గల తుపాకులను డిపాజిట్ చేసుకున్నామని, మిగిలిన వాటిని కూడా పూర్తి స్థాయిలో డిపాజిట్ చేసుకుంటామని వివరించారు.
◆నిరంతర నిఘా
ఫ్లైయింగ్ స్క్వాడ్ మరియు స్టాటిక్ సర్వేలెన్స్ టీములు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని, గ్రామాలను క్లస్టర్‌గా విభజించి నిరంతర గస్తీ నిర్వహిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.
గ్రామ పోలీసు అధికారులను కేటాయించి, క్షేత్ర స్థాయిలో పోలీసు బలోపేతం చేసి, ప్రజలకు ఎన్నికలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్టేషన్ హౌస్ అధికారులు కూడా గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తున్నారని సీపీ వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడె, ఎన్నికల పరిశీలకులు వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.










