కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐటిడిఏ పరిధిలో గిరిజన విద్యార్థుల ఆహార నాణ్యతను పర్యవేక్షించేందుకు ఐటిడిఏ ఆధ్వర్యంలో ఐ టీ డి ఏ పల్స్ యాప్ ను శుక్రవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ ప్రారంభించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని గిరిజన పాఠశాలలు, హాస్టళ్లలో అమల్లో ఉన్న కామన్ డైట్ మెను పర్యవేక్షణకు ఈ యాప్ ఉపయోగపడుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాప్ ద్వారా ప్రతి రోజు హెచ్ ఎం/ హెచ్ డబ్ల్యూ ఒ లు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పహారం, రాత్రి భోజనం వంటి ఆహారపు చిత్రాలను అప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటి వరకు హెచ్ ఎం/ హెచ్ డబ్ల్యూ ఒ లు యాప్‌ను సమర్థవంతంగా వినియోగించి, ఫోటోలను క్రమం తప్పకుండా అప్లోడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అప్లోడ్ చేసిన చిత్రాలను ఐటిడిఏ కార్యాలయం రోజువారీగా పరిశీలిస్తోందని, యాప్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతను నిర్ధారించేందుకు యాప్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అదనంగా హెచ్ ఎం/ హెచ్ డబ్ల్యూ ఒ లు అప్లోడ్ చేసిన ఫోటోలను పి ఒ పేషి స్వయంగా ప్రతిరోజూ పరిశీలిస్తుండగా, ఏ ఐ ఆధారంగా భోజన నాణ్యతను విశ్లేషించే వ్యవస్థ కూడా అమల్లో ఉందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.









