- కాగజ్‌నగర్‌లో ఫ్లాగ్‌మార్చ్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్ నగర్ : రానున్న పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తయ్యేలా భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేశామని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ఎన్నికల వాతావరణాన్ని నిశితంగా పర్యవేక్షించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. శనివారం ఎస్పీ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రధాన మార్కెట్ వరకు భారీగా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. పట్టణంలో పోలీసులు భారీగా కనిపించడంతో ఓ పక్క ప్రజలకు భరోసా కలిగించగా, అల్లర్లు సృష్టించేవారిలో భయం నింపింది. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, డబ్బు రవాణా, హంగామాలు ఏవీ సహించబోమనీ ఎస్పీ స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని, అవసరం అయితే బైండోవర్ చేసి పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ ఫ్లాగ్‌మార్చ్‌లో డీఎస్పీ వహీదుద్దీన్, టౌన్ ఎస్‌హెచ్‌ఓ ప్రేమ్‌కుమార్, రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సైలు సుధాకర్, ప్రశాంత్, సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









