- రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రజల నుంచి సంతకాల సేకరణ
- తుమ్మలగుంటలో అట్టహాసంగా కృతజ్ఞతాభివందన సభ
- వందలాది మంది తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు
- సంతకాలు సేకరించిన ప్రతులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అందజేత
- ఆత్మీయ విందుతో నేతలకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అభినందనలు
తిరుపతి రూరల్ : ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చేపట్టిన కోటి సంతకాల సేకరణ చంద్రగిరి వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో అమితోత్సాహాన్ని నింపింది.. రాష్ట్రంలో ఎక్కడా చేయలేని విధంగా 116 పంచాయతీల్లో 1లక్షా, 16వేల మంది సంతకాలు సేకరించడంతో చంద్రగిరి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సంతకాలు సేకరించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.. అందుకోసం ప్రత్యేకంగా తుమ్మలగుంలోని పార్టీ కార్యాలయం వద్ద కృతజ్ఞతాభివందన సభను నిర్వహించారు.’
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలోని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణపై కృతజ్ఞతాభివందన సభ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యతిథిగా పాల్గొన్న చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సొంత గడ్డపై నుంచి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ పెద్ద మొత్తంలో సంతకాలు సేకరించిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. కోటి సంతకాల ప్రజా ఉధ్యమం ఆరంభంలో అరవైవేలు ఎలా చేయాలన్న భయం కలిగిందని, అయితే ఈ రోజు రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా ఒక లక్షా పదహారు వేల సంతకాలు తీసుకురాగలగడం ఆనందంగా ఉందన్నారు. ఈ కష్టమంతా పార్టీ నాయకులు, కార్యకర్తలదేనని, కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని సమయం వచ్చినపుడు సముచిత స్థానం కల్పించడానికి సిద్ధంగా వున్నానని వెల్లడించారు. కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రతి ఊరిలో ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిన ప్రతి కార్యకర్తకు రుణపడి వుంటానని స్పష్టం చేశారు. అనంతరం కోటి సంతకాల సేకరణలో భాగస్వాములైన మండల పార్టీ, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ, అనుబంద విభాగాల నాయకులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరిచారు.
మండలాల వారీగా సంతకాల ప్రతులు అందజేత:
చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి సంతకాలు సేకరించి తీసుకువచ్చిన ప్రతులను ఆయా మండలాల పార్టీ అధ్యక్షుల సమక్షంలో నాయకులు, కార్యకర్తలు అందరూ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చేతికి అందజేశారు. అనంతరం కోటి సంతకాల సేకరణలో ప్రజల నుంచి వచ్చిన స్పందనను తెలియపరిచారు. ముందుగా పాకాల మండలం, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, చంద్రగిరి, రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల నుంచి సేకరించిన ప్రతులను ప్రత్యేకంగా తయారు చేయించిన అట్టపెట్టెల్లో భద్ర పరచి అందించారు.
జిల్లా పార్టీ కార్యాలయంకు ప్రత్యేక వాహనంలో తరలింపు:
చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను భద్రపరచిన పెట్టెలను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి జిల్లా పార్టీ కార్యాలయంకు తలరించారు. ఆ వాహనాన్ని పార్టీ ముఖ్యనాయకుల నడుమ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కోటి సంతకాల ప్రతులను తరలించడానికి ఆయా మండలాల నుంచి తెచ్చిన ప్రతులను పార్టీ నేతలు స్వయంగా బాక్సుల్లో భద్రత పరచి వాహనంలోకి ఎక్కించారు. జగనన్న ఇచ్చిన ఒక్క సందేశంతో పార్టీ నాయకులు ఎంతో నిబద్ధతగా విజయవంతం చేయడాన్ని రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి అభినందించారు.
కష్టపడిన నేతలు అందరికీ ఆత్మీయ విందు:
కోటి సంతకాల సేకరణలో నెల రోజులకుపైగా కష్టపడిన పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆత్మీయ విందును అందించారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు తరలివచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు అందరికీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు స్వయంగా భోజనం వడ్డించి ఆత్మీయంగా పలుకరించారు. అనంతరం అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల నుంచి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










