- విద్యార్థి సంఘాల డిమాండ్
- విద్యార్థి సంఘాల ఆందోళన అడ్డుకున్న పోలీసులు
- పోలీసులతో విద్యార్థి నేతల వాగ్వివాదం
తిరుపతి : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక తీవ్రమైన ఘటనపై విద్యార్థి సంఘాలు విశ్వవిద్యాలయాన్ని ముట్టడించాయి. విశ్వవిద్యాలయంలోని ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ తమ విభాగంలోని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినిపై లైంగిక వేధింపులు/దాడి జరిపినట్టుగా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. బాధితురాలు గర్భం దాల్చిన తర్వాత టీసీ తీసుకొని తన స్వగ్రామ రాష్ట్రానికి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఈ సంఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థి సంఘాలు సోమవారం విశ్వవిద్యాలయం గేటు వద్ద భారీగా నిరసనకు దిగాయి. ఆరోపణలపై సమగ్ర, స్వతంత్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నిరసన సమయంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను వినియోగించారు.
విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ— విద్యార్థినులపై లైంగిక దాడి జరిగితే అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డి లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరిని ఉద్యోగాల నుంచి తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై తమకు పని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
“విద్యార్థుల భద్రత, గౌరవం విశ్వవిద్యాలయాల మొదటి బాధ్యత. లైంగిక దాడిలాంటి తీవ్రమైన ఆరోపణలపై పారదర్శక విచారణ జరగాలి. బాధితురాలికి న్యాయం చేయాలి. ఘటనను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తే మేము మరింత ఆందోళనలు చేపడతాం”—అని హెచ్చరించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులపై దురుసుగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ బాలమురళి పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక విశ్వవిద్యాలయ యాజమాన్యం ఈ ఆరోపణలను గంభీరంగా పరిగణిస్తున్నామని, ప్రాథమిక నివేదిక ఆధారంగా విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తదుపరి చర్యలు విచారణపరమైన విషయాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది.
ఈ సంఘటనతో విద్యార్థి సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది. క్యాంపస్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నేతలు డాక్టర్ ఓబుల్ రెడ్డి ,ప్రవీణ్ కుమార్ ,ప్రేమ్ కుమార్, సుందర్ రాజు, శివకుమార్ ,స్వరూప్ కుమార్ ,యశ్వంత్ రెడ్డి ,వినోద్ కుమార్ ,చంగల్రెడ్డి, రఫీ ,ప్రదీప్ కుమార్ ,భాస్కర్ యాదవ్, ఉత్తరాది విజయ్, వినోద్ కుమార్ ,నాగేశ్వరరావు , హరి నాయక్ ,తిరువర్ధన్ రెడ్డి, ఓబులేసు ,తదితరులు పాల్గొన్నారు.










