కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా/ కాగజ్ నగర్ : మరోసారి అవకాశం ఇస్తే మాటలకంటే పనులతోనే సమాధానం ఇస్తానని బురదగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చాటరే స్వాతి (పోశెట్టి) అన్నారు. గ్రామంలో మాట్లాడుతూ గత పాలనలో గ్రామ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి పని చేసినట్లు తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్య రంగాల్లో చేపట్టిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు మొదలై మధ్యలో ఆగిపోకుండా కొనసాగాలంటే అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని ఆమె వ్యాఖ్యానించారు. గ్రామ అభివృద్ధిని వెనక్కి నెట్టే ప్రయోగాలకు అవకాశం ఇవ్వొద్దని ప్రజలను కోరారు. సర్పంచ్ ఎన్నికల్లో రిమోట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బురదగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.










