అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు కీలకమైన H-1B వీసా ఎంపిక ప్రక్రియలో ట్రంప్ ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న లాటరీ విధానానికి స్వస్తి పలుకుతూ, అధిక నైపుణ్యాలు, ఎక్కువ జీతాలు పొందే వారికి ప్రాధాన్యత ఇచ్చే కొత్త వెయిటెడ్ విధానాన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉద్యోగ అవకాశాలను కాపాడటానికేనని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) స్పష్టం చేసింది.
ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని అమెరికాలోని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికన్లతో పోలిస్తే తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి దీన్ని ఒక మార్గంగా వాడుకుంటున్నాయని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ ఆరోపించారు. “కొత్త విధానం H-1B కార్యక్రమం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తుంది. ఎక్కువ జీతాలు, అధిక నైపుణ్యాలు ఉన్న విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసేలా కంపెనీలను ప్రోత్సహిస్తుంది. ఇది అమెరికా పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది” అని ఆయన వివరించారు.
కొత్త విధానం ఎలా పనిచేస్తుందంటే…!
ఈ కొత్త విధానం ప్రకారం, ఇకపై H-1B వీసా దరఖాస్తులను యాదృచ్ఛికంగా (random) ఎంపిక చేయరు. బదులుగా, వాటిని జీతం, నైపుణ్యాల స్థాయి ఆధారంగా ర్యాంకులుగా విభజించి, అధిక ర్యాంకులు ఉన్నవాటికే వీసాలు దక్కేలా చూస్తారు. అయితే, తక్కువ జీతాలతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పూర్తిగా తొలగించడం లేదని, కేవలం అధిక నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం పెరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఏటా జారీ చేసే వీసాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. సాధారణ కోటాలో 65,000 వీసాలు, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి అదనంగా 20,000 వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.
ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుండగా, 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన H-1B వీసా రిజిస్ట్రేషన్ల నుంచి దీన్ని వర్తింపజేయనున్నారు. H-1B వీసా వ్యవస్థను సమూలంగా సంస్కరించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నాల్లో ఈ మార్పు ఒక కీలక ముందడుగు. ఇటీవల వీసాకు అర్హత పొందాలంటే యజమానులు అదనంగా 1,00,000 డాలర్లు చెల్లించాలనే నిబంధనను కూడా తీసుకురావడం గమనార్హం.
సాంకేతిక రంగంలో H-1B వీసాలకు అధిక డిమాండ్ ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి వేలాది మంది నిపుణులు ఈ వీసాలపై ఆధారపడి అమెరికాలో పనిచేస్తున్నారు. పాత లాటరీ విధానం వల్ల ప్రతిభకు సరైన గుర్తింపు లభించడం లేదని, కొందరు తక్కువ నైపుణ్యాలున్న దరఖాస్తులతో సిస్టమ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఎప్పటినుంచో విమర్శలున్నాయి. ఈ మార్పుల ద్వారా H-1B కార్యక్రమంపై విశ్వసనీయతను పునరుద్ధరించవచ్చని సంస్కరణల మద్దతుదారులు భావిస్తుండగా, వ్యాపార వర్గాలు మాత్రం కఠినమైన నిబంధనల వల్ల అమెరికా ఆవిష్కరణలు, పోటీతత్వానికి నష్టం వాటిల్లవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.









