వాషింగ్టన్/కాలిఫోర్నియా: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరు కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులు (సీడీఎల్) కలిగి ఉండి, భారీ సెమీ ట్రక్ వాహనాలను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) వెల్లడించింది.
అధికారుల సమాచారం ప్రకారం, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు ఇంటర్ స్టేట్ హైవేలు మరియు ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 30 మంది భారతీయులు కాగా, మిగిలిన వారు ఎల్‌సాల్వడార్, చైనా, హైటి, మెక్సికో, రష్యా తదితర దేశాలకు చెందినవారని తెలిపారు. ఈ అక్రమ వలసదారులకు కాలిఫోర్నియా మాత్రమే కాకుండా ఫ్లోరిడా, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఈ నెల 10, 11 తేదీల్లో ‘ఆపరేషన్ హైవే సెంటినెల్’ పేరుతో యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ), హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలతో కలిసి ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మరో 45 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలోని ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలి కాలంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వ్యక్తులు భారీ ట్రక్కులు నడుపుతూ ప్రమాదాలకు కారణమవడం వల్లే ఈ చర్యలు చేపట్టినట్లు సీబీపీ పేర్కొంది. కొన్ని ప్రమాదాల్లో యువకులు, చిన్నారులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడిన ఘటనలు వెలుగుచూశాయి.
ఈ సందర్భంగా ఎల్ సెంట్రో సెక్టర్ యాక్టింగ్ చీఫ్ జోసెఫ్ రెమేనార్ మాట్లాడుతూ, “అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ట్రక్లు నడపకూడదు. ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఈ చర్యలతో అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.









