మాసాయిపేట – తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నిర్వహించిన జిల్లా సర్పంచుల సమావేశంలో మన్నే కళ్యాణ్ ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడిగా, సంధ్యా రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులుగా, కృష్ణారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు.
ఈ సమావేశానికి రాష్ట్ర సర్పంచుల వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆశదీపక్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో జిల్లా అధ్యక్షుడితో పాటు ఇతర పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ, జిల్లాలోని సర్పంచుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని, గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అదేవిధంగా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన వీరన్న గారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచుల వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో సర్పంచుల హక్కులు, సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.










