కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన తాడూరి వంశీకృష్ణ రెడ్డి అనే వ్యక్తి మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై, అలాగే దళిత వర్గాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై గన్నేరువరం మండలానికి చెందిన మాతంగి అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గన్నేరువరం ఎస్ఐ నరేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ వ్యక్తులు, వర్గాలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి ఘటనలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని, సోషల్ మీడియాలో పోస్టులు చేసే సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ సూచించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.










