కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తూ, గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలను నిర్వీర్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌రేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం (వీబీ జీ రామ్ జీ)” గ్రామీణ ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమాదకరమైన విధాన మార్పులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తిరస్కరిస్తోందని స్పష్టం చేశారు.
ఎంజీఎన్‌రేగా చట్టం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని గుర్తు చేశారు. అలాంటి చట్టాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా కోట్లాది మంది కార్మికుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆమె ఆరోపించారు. వెంటనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాబోయే 20వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆత్రం సుగుణక్క హెచ్చరించారు. గ్రామీణ ప్రజల హక్కుల కోసం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేపడతామని తెలిపారు.
ఈ పత్రికా సమావేశంలో ఆసిఫా నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్యాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









