మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం తృటిలో ఒక భారీ ప్రమాదం తప్పింది. రైల్వే పనుల నిమిత్తం నడుస్తున్న కాంట్రాక్టర్ టిప్పర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల పంట పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి లైవ్ కరెంట్ వైర్లతో సహా వ్యవసాయ రైతు పొలంలో పడిపోయింది. పోలుకు విద్యుత్ సరఫరా కొనసాగు తుండడంతో క్షణాల పాటు రైతులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో పొలంలో ఎవ్వరూ లేక పోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. అదే సమయంలో అక్కడ జనావాసాలు లేదా రైతులు పని చేస్తున్నట్లయితే భారీ ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై పలువురు రైతులు ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ రైల్వే కాంట్రాక్టర్ టిప్పర్ డ్రైవర్లు లైసెన్స్ లేకుండా అతివేగంగా వాహనాలు నడుపుతున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లపై అలాగే రైల్వే కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.









