హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి, హోంమంత్రి బాధ్యతల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
“ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా?” అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను మరిచి, అసాంఘిక చర్యలను ప్రోత్సహించేలా సీఎం మాట్లాడటం ద్వారా తన స్థాయిని తానే దిగజార్చుకున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాకు ఉన్న స్థానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్ బ్లాక్ అయినట్లుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజా వ్యతిరేక విధానాలతో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లోనే సీఎంకు మతిభ్రమించిందని, ఆయన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్టు పెట్టిన వారిపై కూడా కేసులు పెట్టి అరెస్టులు చేసే పోలీసు శాఖ, ఇప్పుడు నేరుగా హింసను ప్రేరేపించేలా మాట్లాడిన ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ తక్షణమే స్పందించి, సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉందని కేటీఆర్ ఆరోపించారు. గత రెండేళ్లుగా తన పాత బాస్ ఆదేశాల మేరకే తెలంగాణ జలహక్కులను తాకట్టు పెట్టారని, తాజా వ్యాఖ్యలతో ఆయన అసలు స్వరూపం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావగా మారిందని అర్థం కావడంతోనే, దానిని వదిలి బయటకు దూకేందుకు రేవంత్ రెడ్డి ముందస్తుగా వ్యూహాలు రచిస్తున్నారని విమర్శించారు.
ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు టీడీపీని తెలంగాణపై రుద్దే ప్రయత్నాలను తెలంగాణ సమాజం తీవ్రంగా తిప్పికొడుతుందని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు ద్రోహం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు.










