వెల్దుర్తి / తూప్రాన్ డివిజన్ : తూప్రాన్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వెల్దుర్తి యెలమ్మ గుడి సమీపంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఎస్సై పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, పిల్లలకు కూడా హెల్మెట్ ఉండాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించాలి, రాంగ్ సైడ్‌లో వాహనాలు నడపరాదని హెచ్చరించారు.
అలాగే, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, నిర్ణీత స్పీడ్ లిమిట్‌ను మించకుండా వాహనాలు నడపాలని తెలిపారు. హైవేలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జెబ్రా క్రాసింగ్‌ల వద్ద పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారి తీస్తుందని పేర్కొంటూ, మొబైల్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే 108కు కాల్ చేసి గోల్డెన్ అవర్‌లో బాధితులకు వైద్యం అందేలా చూడాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వాహనదారులు పాల్గొని పోలీసుల సూచనలను గమనించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు.









