contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి : ఎంపీడీవో ధర్మారావు

జియ్యమ్మవలస: ప్రజలకు జవాబుదారీగా పాలన సాగించడంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కీలక పాత్ర పోషిస్తుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కె. ధర్మారావు పేర్కొన్నారు. గురువారం జియ్యమ్మవలస ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది మరియు సామాజిక కార్యకర్తలకు ‘సమాచార హక్కు చట్టం – అవగాహన’ అంశంపై సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, ఆర్‌టీఐ చట్టంలోని 31 సెక్షన్లపై సమగ్ర అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో అమలులో ఎదురయ్యే సందేహాలను వివరించి, దరఖాస్తుల స్వీకరణ నుంచి సమాచారం అందించే వరకూ అనుసరించాల్సిన విధివిధానాలను స్పష్టంగా వివరించారు.

గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో వచ్చే ఆర్‌టీఐ దరఖాస్తులను ఎలా స్వీకరించాలి, దరఖాస్తు రుసుము, సమాచారం అందించడానికి అయ్యే ఖర్చుల వివరాలను సిబ్బందికి తెలియజేశారు. నిర్ణీత గడువులోగా సమాచారం అందించని పక్షంలో, దరఖాస్తుదారునికి ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అలాగే అప్పీల్ ప్రక్రియ, సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే విధించే జరిమానాలు, శిక్షలు, పై అధికారులకు అప్పీల్ చేసుకునే కాలపరిమితి గురించి వివరించారు. థర్డ్ పార్టీ సమాచారానికి సంబంధించిన నిబంధనలు, ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినప్పుడు అనుసరించాల్సిన ప్రోటోకాల్‌ను కూడా వివరించారు.

ప్రభుత్వ పాలనలో పారదర్శకతే ప్రధాన లక్ష్యమని, ప్రతి అధికారి, ఉద్యోగి ఆర్‌టీఐ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :