గుమ్మలక్ష్మీపురం : ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్న కుశలోయ జలపాతం భవిష్యత్తులో రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కుశలోయలో ఉన్న ఐదు జలపాతాలు, స్వయంభూ శివలింగం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
గ్రామస్తుల బాధ్యత – ప్రభుత్వ గుర్తింపు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ, ప్రభుత్వం సహాయం కోసం ఎదురుచూడకుండా సొంతంగా మెట్లు, సపోర్ట్ కర్రలు ఏర్పాటు చేసిన కుశలోయ గ్రామస్తుల కృషి అభినందనీయమన్నారు. “డబ్బు కంటే ముందే బాధ్యతను చాటుకున్న మీరు, ప్రభుత్వ సహాయం పొందేందుకు పూర్తిగా అర్హులు” అంటూ గ్రామస్తులను కొనియాడారు. పర్యాటకుల సౌకర్యార్థం ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతామని, గుమ్మలక్ష్మీపురం నుంచి ‘రెంటల్ బైక్స్’ అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
డిజిటల్ సేవలు – యువతకు ఉపాధి
జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ, పర్యాటకుల సమాచారం కోసం ప్రధాన కూడళ్లలో క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక యువతకు ట్రెక్కింగ్ గైడ్లుగా శిక్షణతో పాటు ఫస్ట్ ఎయిడ్ శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. భోజనం, వసతుల వివరాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొగనాలి, శిఖపరువు జలపాతాల తరహాలో కుశలోయ కూడా అద్భుతమైన టూరిజం హబ్‌గా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా ‘ప్రభవేళ జలపాతం’
జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కుశలోయలోని మూడు ప్రధాన జలపాతాల్లో ప్రభవేళ జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల మధ్య సూర్యకిరణాలు జలపాతం వెనుక ఉన్న గుహలోకి ప్రసరించడం వల్ల పర్యాటకులకు అరుదైన అనుభూతి కలుగుతుందన్నారు. 5 నుంచి 6 అడుగుల లోతు గల బౌల్ ఆకారపు ప్రదేశం ఈతకు సురక్షితమని వివరించారు.
ఈ కార్యక్రమానికి ముందుగా గ్రామస్తులు, విద్యార్థినులు నృత్యాలతో అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఐసీడీఎస్ పీడీ డా. టి. కనకదుర్గ, డీఈఓ పి. బ్రహ్మజీ, డీఐపీఆర్ఓ కె. బాలమాన్ సింగ్‌తో పాటు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









