మెదక్/తూప్రాన్ డివిజన్ : బాధితుల గౌరవం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన కొత్త విధానాన్ని మెదక్ జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలికలు, మహిళలు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే సమయంలో వేధింపులకు గురవుతున్న అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భయం, మానసిక ఒత్తిడితో చాలామంది బాధితులు ఫిర్యాదు చేయలేకపోతున్నారని, అలాంటి వారికి అండగా నిలవడానికే ఈ కొత్త విధానాన్ని పోలీస్ శాఖ ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు.
మహిళలు, బాలికలు, పిల్లలు, అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే బాధితులు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటివద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో పోలీసులే బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేస్తారని వివరించారు.
బిఎన్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం నేర సమాచారం అందిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ సహా ఏ రూపంలోనైనా కేసు నమోదు చేయాల్సి ఉంటుందని, బాధితుల గౌరవానికి భంగం కలగకుండా సేవలు అందించడమే ఈ విధాన ప్రధాన లక్ష్యమన్నారు. ఈ విధానం దేశంలోనే తొలిసారిగా అమలులోకి వస్తోందని, దీని ద్వారా బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు.
మహిళలు, పిల్లలపై నేరాలు, పోక్సో కేసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, శారీరక దాడులు, ర్యాగింగ్, బాల్య వివాహాల నిషేధ చట్టం కింద నమోదయ్యే కేసులు వంటి ప్రత్యేక నేరాల్లో ఈ ఎస్ఓపీ అమలు చేస్తామని తెలిపారు. బాధితులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే స్పందించి, పోలీసులే ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని కాపీని బాధితులకు అందజేస్తామని చెప్పారు. అవసరమైన సాక్ష్యాల సేకరణ, వాంగ్మూలాల నమోదు కూడా అక్కడికక్కడే చేపడతామని స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలో ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని నేరాలపై భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు.









