మాసాయిపేట/తూప్రాన్ డివిజన్ : గ్రామీణ స్థాయిలో మట్టి లో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్–2025 పోటీల్లో భాగంగా మాసాయిపేట గ్రామ స్థాయి క్రీడలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
మాసాయిపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మాసాయిపేట గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచ్ వీరన్నగారి కృష్ణా రెడ్డి వాలీబాల్ క్రీడను సర్వీస్ చేసి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా చేయడంలో ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పసుల వెంకటేష్, వార్డు సభ్యులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్రీడాకారులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. సీఎం కప్–2025 పోటీలు గ్రామీణ యువతకు మంచి అవకాశంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.









