తూప్రాన్ : కల్వకుంట్ల కుటుంబ అహంకార పాలనకు, లక్షల కోట్ల రూపాయల అవినీతి అప్పుల పాలనకు తెలంగాణ ప్రజలే గుణపాఠం చెప్పారని రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ఘాటుగా విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు ఘనమైన తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు.
శుక్రవారం తూప్రాన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. కేటీఆర్ హయాంలోనే బీఆర్ఎస్ పార్టీకి 8 అసెంబ్లీ సీట్లు చేజారాయని, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు ఇక ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరని, కుటుంబ పాలన, అవినీతికి ప్రజలు చీ కొట్టారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తూప్రాన్‌కు 15 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేయించడంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆయన కృషితో సుమారు 8 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ప్రశంసించారు. ‘ఇందిరమ్మ’ పథకం కింద తూప్రాన్‌కు త్వరలో 3,500 ఇళ్ల మంజూరు జరుగుతుందని వెల్లడించారు.
రెండు సంవత్సరాల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, పింఛన్ దారులకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తూప్రాన్‌కు డిగ్రీ కళాశాల మంజూరు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా సాధిస్తానని తెలిపారు. అలాగే మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చే అంశాన్ని కూడా సీఎం ముందుంచి పరిష్కరిస్తానన్నారు.
రానున్న తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలని, 16 వార్డుల్లో 16 వార్డులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చే రాజకీయ కానుకగా ఉండాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీకి స్థానిక నాయకులపై నమ్మకం లేక సిద్ధిపేట నుంచి నాయకులను దించి తూప్రాన్ ప్రజలను అవమానిస్తోందని విమర్శించారు. తూప్రాన్‌పై సిద్ధిపేట పెత్తనం వద్దని ప్రజలు స్పష్టంగా తీర్పు చెబుతున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజల్లో ఉండాల్సింది పోయి ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని, ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేను ప్రజలే తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు.
మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొందపెట్టే సమయం ఆసన్నమైందని, 16 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తూప్రాన్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ భూమిరెడ్డి మాట్లాడుతూ, గతంలో స్థానికేతర వ్యక్తిని చైర్మన్‌గా నియమించడం వల్లే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, చివరకు అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించి ప్రజలు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి, భూమిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాచారం, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త, సేవాదళ్ నాయకులు, సర్పంచ్‌లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.









