● జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ జిల్లా: 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని, “ARRIVE – ALIVE” అవగాహనా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
● హెల్మెట్ ధారణ ప్రాణరక్ష – కలెక్టర్ పమేలా సత్పతి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గౌరవ డీజీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ARRIVE – ALIVE’ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా అమలు అవుతోందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 22 కోట్ల 10 లక్షల బైక్‌లు ఉన్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడు తలకి గాయం కాకుండా ఉంటే ప్రాణాపాయం తప్పుతుందని గుర్తుచేశారు. వాహనదారులు వ్యక్తిగత భద్రత పాటిస్తూనే, ఇతరులను కూడా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పాల్గొన్న వారికి పోలీస్ శాఖ తరపున హెల్మెట్లను పంపిణీ చేశారు.
● 90 శాతం ప్రమాదాలను నివారించవచ్చు – సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ గతేడాది గణాంకాలను వివరించారు. గత ఏడాది కమిషనరేట్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 200 మంది మరణించగా, అందులో 40 శాతం (80 మంది) టూ వీలర్ వాహనదారులే. మరణించిన వారిలో 90 శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే 90 శాతం ప్రమాదాలను నివారించవచ్చని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
● కొనసాగిన ర్యాలీ మార్గం:
పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ.. బస్ స్టేషన్, ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్ చౌరస్తా, మంకమ్మతోట, శివ థియేటర్ సర్కిల్, కెమిస్ట్ భవన్, కోర్ట్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, కమాన్ చౌరస్తా మీదుగా సాగి తిరిగి పరేడ్ గ్రౌండ్‌లో ముగిసింది.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, తిరుమల్ మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









