contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భారత్​- ఈయూ ఒప్పందం .. మదర్​ ఆఫ్​ ఆల్ డీల్స్’​ అంటున్నారు : మోదీ

భారత్‌–యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఇండియన్ ఎనర్జీ వీక్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కీలక పరిణామాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతు వాటా కలిగిన ఈ ఒప్పందాన్ని ప్రధాని మోదీ “మదర్ ఆఫ్ ఆల్ డీల్స్”గా అభివర్ణించారు. సోమవారం ఈ కీలక ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేసినట్లు వెల్లడించారు.

ఈ ఒప్పందం ద్వారా 140 కోట్ల మంది భారతీయులకు, కోట్లాది మంది యూరోపియన్ యూనియన్ ప్రజలకు అపారమైన అవకాశాలు లభిస్తాయని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భాగస్వామ్యానికి ఇది అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ఇప్పటికే బ్రిటన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA)తో ఉన్న ఒప్పందాలకు ఇది మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

ప్రపంచ సరఫరా గొలుసు (సప్లై చెయిన్) మరింత బలోపేతం అవుతుందని, అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల్లో భారత్‌పై నమ్మకం పెరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కేవలం తయారీ రంగానికే కాకుండా సేవా రంగాన్ని కూడా విస్తృతంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, పాదరక్షల రంగాల్లో పనిచేసే వారిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఒప్పందం ఆయా రంగాలకు భారీ ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,

“సోమవారమే అత్యంత కీలకమైన భారత్–ఈయూ ఒప్పందం పైనల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందం భారత్‌లో తయారీ రంగానికి కొత్త ఊపునిచ్చేలా ఉంటుంది. తయారీకి అనుబంధ రంగాలన్నీ వేగంగా విస్తరిస్తాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్‌పై మరింత విశ్వాసాన్ని కల్పిస్తుంది. భారత్ ఈ రోజు అన్ని రంగాల్లో ప్రపంచ భాగస్వామ్యంపై దృష్టి సారిస్తోంది. ఈ డీల్ వాణిజ్యాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై మన నిబద్ధతను బలోపేతం చేస్తుంది” అని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ హబ్‌గా భారత్

భారత్ త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ హబ్‌గా అవతరిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం 260 మిలియన్ టన్నులుగా ఉన్న భారత రిఫైనింగ్ సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు పెరుగుతుందని చెప్పారు. ఈ దశాబ్దం చివరి నాటికి చమురు, వాయు రంగాల్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ రంగంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్, త్వరలోనే నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ ఎనర్జీ వీక్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 దేశాల ప్రతినిధులు గోవాకు హాజరయ్యారు.

‘ఐరోపా–భారత్ చరిత్ర సృష్టించాయి’

భారత్–ఈయూ ఒప్పందంపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్ స్పందించారు.
“ఐరోపా–భారత్ ఈ రోజు చరిత్ర సృష్టించాయి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌ను విజయవంతంగా ముగించాం. దాదాపు రెండు బిలియన్ల ప్రజల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి బాటలు వేసాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది” అని ఆమె ట్వీట్ చేశారు.

ఈయూ నేతలతో ప్రధాని మోదీ భేటీ

ఒప్పంద ప్రకటన అనంతరం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఇండియా–ఈయూ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అంతకు ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అక్కడ ఉంచిన సందర్శకుల పుస్తకంలో ఈయూ నేతలు సంతకాలు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :