కరీంనగర్ జిల్లా నగరంలో రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో, బుధవారం నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియను అత్యంత భద్రతతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన భద్రతా ఏర్పాట్లపై మీడియాకు వివరాలు వెల్లడించారు.
నామినేషన్ల స్వీకరణ కోసం కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని రెండు భవనాలలో మొత్తం 15 గదులను కేటాయించినట్లు సీపీ తెలిపారు. ఈ గదులలో నామినేషన్లు స్వీకరించేందుకు 33 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని, ప్రతి గది వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
యాక్సెస్ కంట్రోల్, తనిఖీలు కఠినం
నామినేషన్ కేంద్రాల నుంచి 100 మీటర్ల పరిధిలో కఠినమైన యాక్సెస్ కంట్రోల్ అమలు చేస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఈ పరిధి దాటి అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని తెలిపారు. భద్రతలో భాగంగా నామినేషన్ కేంద్రాల భవనాల ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు (DFMD) ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని చెప్పారు.
నామినేషన్ కేంద్రాల్లో ప్రమాదకర ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మంటలు అంటుకునే వస్తువులు (ఫ్లామబుల్ ఐటమ్స్)తో పాటు ఇతర అనధికారిక వస్తువులను తీసుకురావడంపై కఠిన నిషేధం విధించినట్లు సీపీ వెల్లడించారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 25 నుంచి 30 శాతం వరకు సమస్యాత్మక (క్రిటికల్) పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు పోలీస్ బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌లతో కలిసి మంగళవారం నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన భవనాలు, గదులను పరిశీలించారు.








