కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఇట్యాల గ్రామంలో చోటుచేసుకున్న ఆత్మకురే కళావతి హత్య కేసు స్థానికంగా తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. గ్రామంలోని ప్రతి ఇంటిని ఈ ఘటన దుఃఖసంద్రంలో ముంచెత్తింది.
గ్రామస్తుల వివరాల ప్రకారం, 28-01-2026 న కళావతి ఒక స్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా, వగడే బడేరామ్ అనే వ్యక్తి కావాలనే తన వాహనంతో ఢీకొట్టి, అనంతరం పీక నులిమి అమానుషంగా హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దారుణ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ ఇట్యాల గ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ, “కళావతి హత్య అత్యంత దారుణమైన ఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తప్పనిసరి” అని అన్నారు. నిందితుడు బడేరామ్పై కఠినమైన శిక్ష అమలు చేయడంతో పాటు, కేసును వేగవంతంగా విచారించాలని పోలీస్ విభాగాన్ని డిమాండ్ చేశారు.
కళావతి హత్యకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో న్యాయం జరగాలంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు.








