కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని, కొమురం భీం ఆసిఫాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని రూమ్ నెం.13లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌తో పాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ను జిల్లా కలెక్టర్ కె.హరిత శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యస మండలాధికారి లోకేశ్వర్ రావు కలెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా సెంటర్లో మీడియా ప్రతినిధులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసీఎంసీ విధుల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ఎన్నికల ప్రచార ప్రకటనలకు సంబంధించిన వ్యయాన్ని సకాలంలో లెక్కించాల్సి ఉంటుందన్నారు.
అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం గమనిస్తూ, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన అంశాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మీడియా సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








