కురుపాం మండలం : ప్రజారోగ్యమే ద్యేయంగా అంకితభావంతో వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. మొండెంఖల్లు, నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో శుక్రవారం మొండెంఖల్లు పిహెచ్సీలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా సచివాలయ గ్రామాల వారీగా అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి నివేదికలను పరిశీలించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ముఖ్యంగా గర్భిణీ మహిళల ఆరోగ్య సంరక్షణ, ఎంసిపి కార్డులో వివరాల నమోదు విధానం, హైరిస్క్ గర్భిణీల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, పర్యవేక్షణలో ఎలాంటి జాప్యం జరిగినా తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి బుధవారం, శనివారం టీకా సెషన్లు తప్పనిసరిగా నిర్వహించి, గడువులోగా పిల్లలకు అన్ని టీకాలు వేయాలని ఆదేశించారు. ఎంఆర్–1, ఎంఆర్–2 టీకాల శాతం వందకు వంద ఉండాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అందజేసే వైద్య సేవలను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు (EHR)లో నమోదు చేయాలని సూచించారు. దీని ద్వారా ఏ ఆసుపత్రిని సందర్శించినా సిటిజన్ అభా నంబర్ ద్వారా రోగి గత ఆరోగ్య సమాచారం తెలుసుకునే అవకాశం ఉండటంతో పాటు, వేగవంతంగా వైద్య సేవలు అందించడానికి ఈ విధానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
వైద్యాధికారులు ప్రతి వారం వైద్య సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య నివేదికల పురోగతికి కృషి చేయాలని డాక్టర్ భాస్కరరావు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కె.వి.ఎస్. పద్మావతి, ప్రోగ్రాం ఆఫీసర్ డా. సూర్యకౌశిక్, వైద్యాధికారులు డా. వెంకటేష్, డా. వల్లి, డా. సాహితి, డా. నిహారిక, ఆరోగ్య పర్యవేక్షకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








