తిరుపతి : జాతీయోద్యమ స్ఫూర్తితో దేశాన్ని ఏకం చేసేందుకు, మతోన్మాదాలను నిర్మూలించేందుకు స్వామి వివేకానంద కలలుగన్న ఉజ్వల భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో జైభారత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ప్రజా ఉద్యమం ‘జైహో’ను బలోపేతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతిలోని ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ వద్ద గాంధీ విగ్రహం నుంచి వివేకానంద యూత్ హాస్టల్ వరకు జైహో సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా “దేశాన్ని ఏకం చేద్దాం”, “మతోన్మాదాలకు చెక్ పెడదాం”, “ఐక్యతే మా బలం – మానవత్వమే మా మతం” వంటి నినాదాలతో ప్రజలను ఉత్తేజపరిచారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జైహో జాతీయ అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ విజయ శంకర స్వామి, జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి యోధ లోకనాథ్, జైభారత్ జాతీయ ఉపాధ్యక్షుడు ఖదిజ్ఞాసి యోధ వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జైహో సంస్థ హిందూ–ముస్లింల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు ఐక్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థ దాదాపు 25 సంవత్సరాలుగా మతసామరస్యాన్ని పెంపొందించేందుకు పనిచేస్తోందన్నారు.
మహాత్మా గాంధీ కూడా భారతదేశంలో హిందూ–ముస్లింల ఐక్యత కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడని వారు గుర్తు చేశారు. మతచాందసత్వానికి వ్యతిరేకంగా, అహింసా మార్గంలో ఈ సంస్థ పోరాడుతోందని తెలిపారు. “కత్తికి కత్తి సమాధానం కాదు, శాంతే సమాధానం” అన్న గాంధీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జైహో నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా సాహా అమీన్, ఉపాధ్యక్షులుగా కాలయ్య, రెడ్డప్ప కుమార్ రెడ్డి, విజయనిర్మల, కార్యదర్శులుగా నారాయణ, లక్ష్మణ్, రఫీ, మదన, శాఖ చంద్రబాబును ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కార్యకర్తలు కే.హెచ్.డి. రజిని, శ్యాంసుందర్, షాజహాన్, నారాయణ, స్వప్న, చంద్రకళ, మనీ తదితరులు పాల్గొన్నారు.








