కరీంనగర్ జిల్లా | గన్నేరువరం :గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ వన జాతరలో ప్రధాన ఘట్టం గురువారం ఘనంగా అవిష్కృతమైంది. తల్లి సమ్మక్కను కోయ పూజారులు గద్దెకు చేర్చడంతో జాతర వైభవం పరాకాష్టకు చేరింది. శివసత్తుల పూనకాలు, డప్పుల మోతలతో పరిసరాలు భక్తిమయంగా మారాయి.
పిల్లాపాపలతో పాటు నిలువెత్తు బంగారంతో ఆదివాసి దేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మానేరు డ్యాం పక్కన గన్నేరువరం పెద్ద చెరువు ఒడ్డున జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతర జనసంద్రంగా మారింది. భక్తులు జాతర కమిటీ ఏర్పాటు చేసిన షవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకున్నారు.
పోలీసుల బందోబస్తు
గన్నేరువరం, మైలారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై జి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి
జాతర సందర్భంగా మానకొండూరు శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క–సారలమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందించి, ఎమ్మెల్యేను ఘనంగా శాలువలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంత రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కటకం తిరుపతి, నాయకులు మార్గం మల్లేశం, దేశరాజు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్న వేములవాడ ఎస్సై
గన్నేరువరం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ ఎస్సై బుర్ర ఎల్లయ్య గౌడ్ తన సతీమణి సంధ్యారాణి, కుమారుడు సాయి రోహన్‌తో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం కమిటీ సభ్యులు ఎస్సై ఎల్లయ్య గౌడ్‌ను శాలువలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు బోయిని పోషయ్యను ఎల్లయ్య గౌడ్ కుటుంబ సభ్యులు ఘనంగా శాలువతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బుర్ర తిరుపతి గౌడ్, బుర్ర రాజ్‌కోటి గౌడ్, బోయిని మల్లయ్య, బుర్ర మల్లయ్య, కయం మహేష్, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జాతర ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు.








