contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆసియాకప్‌లో భారత్‌కు వరుసగా రెండో విజయం … సూపర్-4లోకి దూసుకెళ్లిన టీమిండియా

ఆసియాకప్‌లో భాగంగా గత రాత్రి హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-4లోకి దూసుకెళ్లింది. పసికూన అయిన హాంకాంగ్ వికెట్లు కాపాడుకుంటూ శక్తిమేర పోరాడినా బలమైన భారత్ ముందు నిలవలేకపోయింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో హాంకాంగ్ గట్టిగానే పోరాడింది. భారత్ బలమైన బౌలింగ్ దాడిని ఎదుర్కొని వికెట్లు కాపాడుకుంటూ గట్టిపోటీనే ఇచ్చింది.

బాబర్ హయత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. కించిత్ షా 28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. జీషన్ అలీ 26 పరుగులు చేశాడు. చేతిలో వికెట్లు ఉన్నా జోరుగా ఆడడంలో విఫలమైన హాంకాంగ్ విజయానికి 40 పరుగుల ముందు నిలిచిపోయి టోర్నీలో తొలి పరాజయాన్ని చవిచూసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, అవేశ్ ఖాన్‌లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ 36, రోహిత్ శర్మ 21 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు చెలరేగిపోయారు. ఇద్దరూ అర్ధ సెంచరీలతో విరుచుకుపడ్డారు. 44 బంతుల్లో ఫోర్, మూడు సిక్సర్లతో 59 పరుగులు చేసిన కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో 31వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హాంకాంగ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు పిండుకున్నాడు. అతడి దెబ్బకు హాంకాంగ్ బౌలర్ హరూన్ అర్షద్ మూడు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆసియాకప్‌లో భాగంగా నేడు శ్రీలంక-బంగ్లాదేశ్‌లు తలపడతాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :