ఆబ్కారీ ఎస్సై, కానిస్టేబుల్‌పై నలుగురు మందుబాబులు దాడిచేసి చితకబాదారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పురానీపేట శివారులో జరిగిందీ ఘటన. ఇక్కడ నాటుసారాను విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్సై నర్సింలు కానిస్టేబుల్‌ను వెంటపెట్టుకుని వెళ్లారు. ఆ సమయంలో అక్కడ మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఒకడు పోలీసుల చేతికి చిక్కాడు. అతడిని విచారించి వెళ్తున్న ఎస్సై, కానిస్టేబుల్‌ను అడ్డుకున్న మిగతా ముగ్గురు వారిపై దాడిచేశారు. ఎస్సై చేతిలోంచి లాఠీ లాక్కుని చితకబాదారు. ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.