వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ (KUC) రక్షక భట నిలయంలో నమోదైన ఓ కేసుకు సంబంధించి లంచం డిమాండ్ చేస్తూ సబ్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి అడ్డంగా దొరికాడు. ఫిర్యాదుదారునికి నోటీసు జారీ చేయడం, ఛార్జిషీట్‌ను త్వరితగతిన దాఖలు చేయడం, అలాగే కేసులో జప్తు చేసిన వాహనాలు మరియు మొబైల్ ఫోన్లను విడుదల చేయడానికి లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదుదారుని నుంచి రూ.15,000 లంచం తీసుకుంటున్న సమయంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. శ్రీకాంత్‌తో పాటు అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి. నజీర్‌లను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో పథకం ప్రకారం దాడి చేసిన ఏసీబీ అధికారులు లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
ప్రజలకు ఏసీబీ సూచన:
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే ప్రజలు భయపడకుండా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు.










