అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూ యు) ఏడవ మండల మహాసభ ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించి, రానున్న మూడు సంవత్సరాలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించామని తెలిపారు. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యవసాయ కార్మికులకు సంవత్సరమంతా పనులు కల్పించి, పనులకు తగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రతి జాబ్ కార్డుకు 200 రోజులు పని కల్పించాలని, రోజువారీ వేతనం రూ.600కు పెంచాలని కోరారు. గుత్తి పట్టణంలో కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రతి పేద కుటుంబానికి మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయించి, ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. సాగుభూమి లేని పేదలకు భూ పంపిణీ ద్వారా ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల వలసలను నివారించేందుకు సమగ్ర చట్టం తీసుకురావాలని, వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.
పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని కోరారు. గ్రామాల్లో మంచినీరు, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని, మహిళలకు సంవత్సరానికి రూ.18,000 ఆర్థిక సాయం వెంటనే అమలు చేయాలని అన్నారు. అలాగే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించి అందరికీ గ్యాస్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నిర్మల, మండల అధ్యక్షులు చందు, కార్యదర్శులు మల్లేష్, మద్దిలేటి, రామేశ్వరి, రేణుక, సునీత, మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుకమ్మ, రేవతి, ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.








