బెంగుళూరు / కర్ణాటక : బెంగళూరులో ఉగ్ర కలకలం రేగింది. అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద మాడ్యుల్ కీలక కుట్రదారును పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఈ రోజు ఉదయం ఓ మహిళను అరెస్టు చేశారు. అల్‌ఖైదా టెర్రర్ మాడ్యుల్ మాస్టర్ మైండ్ అయిన షామా పర్వీన్ ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. దేశంలో ఉగ్రవాదులకు మద్దతిస్తున్నవారిని గుర్తించడానికి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా జరిపిన సోదాలలో షామా పర్వీన్ కర్ణాటక నుంచి ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశామన్నారు.
కాగా ఈ నెల 23న ఈ మాడ్యుల్ తో సంబంధమున్న మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ, మహమ్మద్ ఫైక్ లను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా పలువురు ఉగ్ర అనుమానితులకు షామా పర్వీన్ నాయకత్వం వహిస్తోందని వివరించారు. సోషల్ మీడియాలోని ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా వీరంతా సంప్రదింపులు జరుపుతున్నారని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు కుట్ర చేశారని అధికారులు వివరించారు.