అల్లూరి జిల్లా, హుకుంపేట: మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు సంత వాహనదారులకు, స్థానికులకు ఇబ్బందిగా మారుతోంది. సంతకు మండలం నుంచి కాకుండా అరకు, డుంబ్రిగూడ, పెద్దబయలు, పాడేరు మండలాలకు చెందిన వారితో పాటు ఒడిస్సా కు చెందిన వ్యాపారస్తులు కూడా వస్తుంటారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సంత రాత్రి 6 వరకు కొనసాగుతుంది. సంతకు వచ్చే వారు, అటుగా వెళ్లే కార్లు, బైక్లతో రోడ్డంతా కిక్కిరిసిపోతోంది. దీంతో సంత జరిగే రోజు మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అలాగే సంతకు వచ్చే వినియోగదారులకు తమ వాహనాలు నిలిపేందుకు సరైన పార్కింగ్ స్థలం లేదు. షాపింగ్కు వచ్చిన వారు తమ వాహనాలను రోడ్లపైనే పార్కు చేయడంతో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అటుగా వెళ్లే బస్సులు ప్రధాన రహదారిపైనే నిలిపేస్తున్నారు. గంటల తరబడి వాహనాలు ఎటూ వెళ్లే మార్గంలేక నానా ఇబ్బందులు తప్పడంలేదు. సంత రోజు ప్యాసింజర్ ఆటోలను గ్రామంలోకి రానివ్వకుండా చూడడంతో పాటు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపకుండా చూస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
