అల్లూరి జిల్లా హుకుంపేట : సీసీ రోడ్డు సదుపాయం లేక విద్యార్థులు పాఠశాలకు మట్టి రోడ్డు వెంట నడిసి వెళ్తూ ఇబ్బందులు పడుతున్న సంఘటన మండలంలోని బారపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామం నుంచి పాఠశాలలకు విద్యార్థులు, నిత్యవసర సరుకులకు ప్రజలు వెళ్తున్నప్పుడు వర్షాకాలంలో రోడ్డు పూర్తిగా బురదమయమై నడవడానికి వీల్లేకుండా ఉండడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించి విసుగుచెందాం తప్ప రోడ్డు సమస్య పరిష్కరించే నాధుడే కరువయ్యాడని విమర్శిస్తున్నారు. అత్యవసర సమయంలో ఆరోగ్యం బాగు లేకపోయినా 108 కూడా వచ్చే దాఖల్లేవని, నడక ద్వారా తీసుకెళ్లే పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజీని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
