అమీన్ పూర్ : పటాన్చెరు నియోజకవర్గంలో వెనకబడిన వర్గాలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు.. వడ్డెర కులస్తుల సంక్షేమానికి అండగా నిలుస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మంజీర నగర్ లో ఒక కోటి 25 లక్షల రూపాయలు వడ్డెర సంఘం కాంట్రాక్టర్ల సి ఎస్ ఆర్ నిధులతో 1500 గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మించిన వడ్డెర సంగం నూతన కమ్యూనిటీ హాల్ ను ఆదివారం సాయంత్రం ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వడ్డెరల సంక్షేమానికి ఎల్లప్పుడు అండగా ఉంటున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వడ్డెరలకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వడ్డెర సామాజిక వర్గంలోనూ ఉన్నత చదువులు చదువుతూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అభినందించారు. నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను నిరుపేద కుటుంబాల వివాహాలకు నామమాత్రపు రుసుముతో అందించాలని కోరారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొల్లూరి మల్లేష్, గోపాల్, ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు అనిరుద్ధ రెడ్డి, యునూస్, దాసు, వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు గొలుసుల కోమరయ్య, ఉపాధ్యక్షుడు రవి, వడ్డెర సంఘం సభ్యులు గంగయ్య, వెంకన్న, గొలుసుల వెంకటేష్, సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.