జడ్చర్ల: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Anirudh Reddy ఇప్పపువ్వుతో తయారు చేసే సారాపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పపువ్వుతో చేసే సారా ఆర్గానిక్ స్వభావం కలిగినదని, ఇది ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ప్రతిపక్షాలు కూడా స్వాగతించే అవకాశముందని అన్నారు.
ఇప్పపువ్వు అడవుల్లో సహజంగా లభించే వనరని ఆయన తెలిపారు. దీన్ని సక్రమంగా వినియోగించి ఉత్పత్తి చేస్తే ప్రపంచ మార్కెట్‌లో కూడా పోటీ పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై తాను పూర్తి నివేదికను సిద్ధం చేసుకున్నానని, త్వరలో అసెంబ్లీలో ఇప్పసారా వల్ల కలిగే లాభ నష్టాలపై వివరంగా మాట్లాడతానని తెలిపారు.
ప్రపంచంలోని కొన్ని దేశాలు తమ సంప్రదాయ పానీయాలను తయారు చేసి ఎగుమతి చేస్తున్నాయని ఆయన ఉదాహరణగా చెప్పారు. మెక్సికోలో తయారయ్యే టకీలా, ఫ్రాన్స్‌లో తయారయ్యే కొనియా వంటి పానీయాలు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ పొందుతున్నాయని వివరించారు.
గతంలో ఇప్పసారా తాగిన వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా 110 సంవత్సరాల వరకు జీవించారని ఆయన పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం మద్యం సేవించే వారు 60 సంవత్సరాల వయస్సు కూడా ఆరోగ్యంగా గడపడం కష్టంగా మారిందని అన్నారు.
ఇప్పపువ్వుతో తయారు చేసే సారాను సక్రమంగా మార్కెట్ చేస్తే ఆదివాసీలు, ఎస్టీ వర్గాలకు మంచి జీవనోపాధి కల్పించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గణనీయమైన ఆదాయం లభించే అవకాశం ఉందని తెలిపారు.








