ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే అంబటి రాంబాబు అంటే జగన్ కు అభిమానం.
కానీ ఒకే ఒక ఆరోపణవల్ల తాజాగా జగన్ డైలమాలో పడాల్సి వచ్చింది. అంతేకాదు.. అంబటికి కష్టకాలం వచ్చిందని చెప్పవచ్చు. చివరకు ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.
వారం రోజులుగా మంత్రిపై ఒకటే ఆరోపణ
వారం రోజులుగా అంబటి రాంబాబుపై ఒకే ఆరోపణ వస్తోంది. దీనిపై ఆయన వివరణ కూడా ఇచ్చారు. శవాలమీద పేలాలు ఏరుకునే ఖర్మ తనకు పట్టలేదని, తాను అంతటి దౌర్భాగ్యమైన పనులు చేయనని గట్టిగా చెప్పారు. ఒక కార్మికుడి మరణంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.5 లక్షలు మంజూరయ్యాయి. స్థానికంగా అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ఆ కుటుంబానికి ఫోన్ చేశారు. రూ.5 లక్షలకు చెక్ వచ్చిందని, కావాలంటే రూ.2.5 లక్షలు చెల్లించాలంటూ బేరం ఆడారు. దీంతో బాధితులు మంత్రి అంబటి రాంబాబును కలవగా ఆయన కూడా ఇదే సమాధానం చెప్పారంటూ బాధితులు మీడియాకు చెప్పారు.
కుమార్తెమీద ప్రమాణం చేసి చెబుతున్న బాధితుడి తల్లిదండ్రులు
బాధితుడి తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తె మీద ప్రమాణం చేసి తాము చేస్తున్న ఆరోపణలు నిజమని, అంబటి తమను లంచం అడిగారని తాజాగా పేర్కొన్నారు. ఈ విషయం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పర్యటనకు వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆ తర్వాత వాటిని అంబటి ఖండించారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు తమ బిడ్డమీద ప్రమాణం చేసి తాము చెప్పేవన్నీ నిజాలంటున్నారు. మొదటిసారే అంబటి రాంబాబుమీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వెంటనే వాటిని ఖండించివుంటే బాగుండేదని, ఆలస్యమవడంతో నష్టం జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముందే హెచ్చరించిన జగన్
ఇటీవలే మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలంతా జాగ్రత్తగా ఉండాలని, వచ్చే ఎన్నికల సీజన్ కావడంతో ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, మీడియా కూడా గమనిస్తుంటుందని సూచించారు. అది చెప్పిన తర్వాత ఈ సంఘటన వెలుగు చూసింది. ఆరోపణల్లో కూరుకుపోయిన అంబటి రాంబాబు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. జగన్ కఠినంగా వ్యవహరిస్తారా? లైట్ తీసుకుంటారా? అనేది సస్పెన్స్ గా మారింది. అంబటి తాను ఇక్కట్లు ఎదుర్కోవడమేకాకుండా ముఖ్యమంత్రి జగన్ ను సైతం డిఫెన్స్ లోకి నెట్టేశారని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం చివరకు ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి