contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎమ్మెల్యేలు గీత దాటొద్దు… ఇది టీం వర్క్: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ – అమరావతి : “డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే 15 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహకారంతో ఈ ప్రభుత్వం ఒక టీంలా పనిచేస్తోంది. ఈ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా, విఘాతం కలిగించేలా వ్యవహరించినా రాష్ట్రానికే నష్టం జరుగుతుంది. ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని మాట్లాడితే అభివృద్ధి లక్ష్యానికి ఆటంకం కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. శాసనసభలో నేడు ‘సూపర్ సిక్స్’, ఇతర మేనిఫెస్టో హామీల అమలుపై జరిగిన చర్చలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వ ప్రగతిని వివరించారు.

సంక్షేమ పథకాల అమలుపై సమగ్ర నివేదిక
కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ముఖ్యమంత్రి అంకెలతో సహా వివరించారు. “ఎంతో ఆలోచించి పింఛన్ల పథకానికి ‘పేదల సేవలో’ అని పేరు పెట్టాం. ఈ కార్యక్రమం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది” అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 63.50 లక్షల మందికి ప్రతినెలా రూ.2,745 కోట్లు ఖర్చు చేస్తూ పింఛన్లు అందిస్తున్నామని, ఇందులో 59 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు.

ఏడాదికి రూ.32,143 కోట్లతో దేశంలోనే అత్యధికంగా పింఛన్లపై ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని, మన తర్వాత ఉన్న తెలంగాణ, కేరళ రాష్ట్రాలు మన ఖర్చులో పావు వంతు మాత్రమే చేస్తున్నాయని పోల్చి చెప్పారు. సచివాలయ సిబ్బంది కృషితో తొలిరోజే 97 శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతోందని అభినందించారు.

ఆనందంగా భరిస్తాం
మహిళల అభ్యున్నతికి అమలు చేస్తున్న పథకాల గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. “స్త్రీ శక్తి పథకం నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు 8.86 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. దీనివల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది. ఏటా రూ.2,963 కోట్లు ఖర్చయినా ఆనందంగా భరిస్తాం” అని అన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా ఆదాతో పాటు, సామాజికంగానూ మేలు జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

‘తల్లికి వందనం’ పథకం కింద 66.57 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లు అందించామని, ఇంకా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ‘దీపం-2.0’ పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని, ఇప్పటివరకు 2.66 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యమని, ఈ బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

రైతులు, యువతకు అండగా ప్రభుత్వం
“నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను. రైతులను ఆదుకునే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉంది” అని చెబుతూ రైతు సంక్షేమ పథకాలను వివరించారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.14,000 అందిస్తోందని, పీఎం కిసాన్‌తో కలిపి రైతులకు ఏటా రూ.20,000 అందుతోందని తెలిపారు. ఇప్పటికే 46.86 లక్షల మంది రైతులకు రూ.3,174 కోట్లు అందించామని చెప్పారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం కన్నా మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.12,858 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కోసం రూ.991 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. యువతకు ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, ఇప్పటికే 4,71,574 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని పేర్కొన్నారు.

ఆరోగ్యం నుంచి అన్నదానం వరకు భరోసా
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ని అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించామని, త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో మరో 70 ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఇళ్ల పథకంలో భాగంగా వచ్చే ఏడాది జూన్ నాటికి 6.15 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, 2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు.

నా ఊపిరి ఉన్నంత వరకు పేదల కోసమే పనిచేస్తా
గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని, రామతీర్థం, అంతర్వేది, దుర్గ గుడి ఘటనలను ఆయన గుర్తుచేశారు. ఇసుక మాఫియాను అరికట్టి, ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. “నాపై క్లైమోర్ మైన్లతో దాడి చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టారు. నా ఊపిరి ఉన్నంత వరకు పేదల కోసమే పనిచేస్తాను. రాష్ట్రాన్ని పునర్నిర్మించి, తెలుగు జాతిని దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలబెట్టడమే నా లక్ష్యం. ఆ దిశగా అందరూ కలిసి పనిచేయాలి” అని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :