contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం.. సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని శనివారం ఘనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్‌కు ఏటా రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌లు ఉండవల్లి నుంచి ప్రత్యేకంగా ఆటోలో ప్రయాణించి వేదిక వద్దకు చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్, కూటమి నాయకులను మంగళగిరి చేనేత కండువాలతో సత్కరించారు. తమ అభిమాన నాయకులను చూసేందుకు మంగళగిరి నుంచి ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ పథకం ద్వారా తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,90,669 మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 2,64,197 మంది ఆటో డ్రైవర్లు, 20,072 మంది ట్యాక్సీ డ్రైవర్లు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 436 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో లేనప్పటికీ, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘స్త్రీశక్తి’ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ఆగస్టు 15న సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేశారు.

లబ్ధిదారులు తమ దరఖాస్తు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆధార్ నంబర్ ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ డబ్బులు జమ కాకపోయినా లేదా జాబితాలో పేరు లేకపోయినా, అవసరమైన పత్రాలతో సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :