contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే మన టార్గెట్: సీఎం చంద్రబాబు

అమరావతి : ఎపి రాయలసీమ ప్రాంతంలో, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నూతనంగా రూపొందించిన ‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0’పై సోమవారం నాడు సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమలోని శ్రీసిటీ, హిందూపూర్, కొప్పర్తి వంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయని, ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన నిర్దేశించారు.

‘మేడ్ ఇన్ ఇండియా’ లక్ష్యాలు నెరవేరేలా నూతన పాలసీ

అధికారులు వివరించిన వివరాల ప్రకారం, దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గించి, ఉత్పత్తిని పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నూతన విధానానికి రూపకల్పన చేశారు. గత ఏడాది దేశంలో 70 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని, ఈ రంగంలో భారీ డిమాండ్ ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో ‘ఆత్మ నిర్భర్’ మరియు ‘మేడ్ ఇన్ ఇండియా’ లక్ష్యాలు నెరవేరాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి డిమాండ్‌ను తీర్చేందుకు వీలుగా ఏపీలో భారీస్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని, ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్‌ను సృష్టించడం కీలకమని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ విస్తృత ఉత్పత్తికి ఆస్కారం ఇచ్చేలా చూడాలని, పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకో సిస్టంను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో భూమి లభ్యత కొరత తీవ్రంగా ఉన్నందున, ఏపీలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పరిశ్రమలు స్థాపించేందుకు అనుకూల ప్రాంతాలు ఉన్నాయని, ఇది రాష్ట్రానికి సానుకూల అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని శ్రీసిటీ, కర్నూలు సమీపంలో ఓర్వకల్లు, కొప్పర్తి, హిందూపూర్ వంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, ప్రతీ ఇంటికీ ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.

ఐటీ కంపెనీలకు మూడు రీజియన్లు అనుకూలం

ఇక ఐటీ రంగం విషయానికి వస్తే, విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో 500 ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖలో ఐటీ, ఐటీఈఎస్ సంస్థలతో పాటు లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. ఈ ప్రాంతాల్లో కో-వర్కింగ్ స్పేస్‌లను కూడా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

విశాఖ, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం నైపుణ్యం పోర్టల్‌తో ఇతర పోర్టల్స్‌ను కూడా ఇంటిగ్రేట్ చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా యువతకు నైపుణ్యాలను పెంచాల్సి ఉందన్నారు. అలాగే, విద్యా రంగంలోనూ కొత్త పాఠ్యాంశాలను జోడించాలని సీఎం సూచించారు. తద్వారా రాష్ట్రంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభ్యం అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నంబర్ వన్‌గా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :