రేషన్ కార్డులపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులోనే వస్తాయని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మే నెల నుంచి ఈ కొత్త రకం రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుందని తెలిపారు.
ఇందులో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఉంటాయని మంత్రి నాదెండ్ల వివరించారు. క్యూఆర్ కోడ్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త తరహా రేషన్ కార్డులు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ-కేవైసీ పూర్తయ్యాక ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని అన్నారు.
నేటి నుంచి దీపం-2 రెండో విడత సిలిండర్ బుకింగ్
దీపం-2 పథకంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నేటి నుంచి దీపం-2 రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని తెలిపారు. కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారని గ్యాస్ కంపెనీలు చెప్పాయని వివరించారు.
జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం
జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఎండీయూల కొనుగోలు పెద్ద కుంభకోణమని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఖరీఫ్ లో 35.93 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహించేలా వెసులుబాటు కల్పించామని అన్నారు. మొత్తం 16 వేల మంది రైతులు వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్మకం సదుపాయాన్ని వినియోగించుకున్నారని మంత్రి వెల్లడించారు.
ఏపీ పోర్టుల ద్వారా తెలంగాణ బియ్యం ఎగుమతులు
ఏపీ పోర్టుల ద్వారా తెలంగాణ లక్షన్నర టన్నుల బియ్యం ఎగుమతి చేసిందని మంత్రి నాదెండ్ల తెలిపారు. తెలంగాణ ఎగుమతులకు కేంద్రం అనుమతి మంజూరు చేసిందని తెలిపారు.