దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసులో అధికార వైసీపీ నాయకులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన ఘటనలో తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.
దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసులో అధికార వైసీపీ నాయకులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన ఘటనలో తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. దర్యాప్తు దశలో ఉన్న కేసును కొట్టివేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు పలుతీర్పులు ఇచ్చిందని న్యాయస్థానం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. నిందితులపై తదుపరి చర్యలను నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం తీర్పు ఇచ్చారు. ఇసుక మాఫియాను ఎదిరించినందుకు వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి ప్రోద్భలంతో అతని అనుచరులు ఏకంగా తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం పోలీస్ స్టేషన్‌లోనే దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దళిత, ప్రజా సంఘాలు నిరసనకు దిగడంతో వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైసీపీ నేత కవల కృష్ణమూర్తి, అతని బంధువులు, అనుచరులు కవల వెంకట నాగదుర్గాశివ ప్రసాద్, కే వీరబాబు, కే నాగేంద్రబాబు, అడపా పుష్కరం, అడపా భూషణంపై సీతానగరం ఠాణా పోలీసులు 2020 జూలైలో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ నిందితులు అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులపై తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ 2020 సెప్టెంబరు 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి గురువారం నిర్ణయాన్ని వెల్లడించారు. కేసును కొట్టివేసేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.