అమరావతి/పల్నాడు: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలో రక్తం ఏరులై పారితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో రైతుల పొలాలకు సాగునీరు పారుతోందని పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పల్నాడులో ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఆదివారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో సందేశం విడుదల చేసిన మంత్రి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్న ఘర్షణకు రాజకీయ రంగు పులిమి, టీడీపీపై బురద జల్లేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. విధ్వంసకర రాజకీయాలే వైసీపీ అస్తిత్వమని విమర్శించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఫ్యాక్షన్, అక్రమ మైనింగ్, దౌర్జన్యాలతో పల్నాడు ప్రాంతం వల్లకాడుగా మారిందని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు 300 మంది భయంతో గ్రామం విడిచి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క పిన్నెల్లి గ్రామంలోనే 12 మంది హత్యకు గురయ్యారని, వారిలో ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ మైనింగ్ కోసం తవ్విన గుంతల్లో పడి ఏడెనిమిది మంది ప్రాణాలు కోల్పోయినా నాటి ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పల్నాడుకు వచ్చినప్పుడు ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని మంత్రి గుర్తుచేశారు.
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో ఊరు విడిచి వెళ్లిన ప్రజలంతా ధైర్యంగా తిరిగి తమ గ్రామాలకు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే పల్నాడు రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించి, పొలాలకు నీరు అందిస్తున్నామని వివరించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలన్నదే చంద్రబాబు ఆశయమని తెలిపారు.
వైసీపీ కుట్రపూరిత, విధ్వంసకర రాజకీయాల కారణంగానే ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అయినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. అక్రమ సంపాదనతో పుట్టిన పార్టీ వైసీపీ అయితే, తెలుగోడి ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు.
అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించిందని ఆరోపించిన మంత్రి, గ్రామాల్లో జరిగే హత్యలకు రాజకీయ రంగు పులిమి, ఎవరు చనిపోతారా అని ఎదురుచూస్తూ రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొందని, దానికి భంగం కలిగించే వారిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలపై ఉక్కుపాదం మోపుతామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ లేని పల్నాడును నిర్మించి, ప్రతి రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పునరుద్ఘాటించారు.










