ఆంధ్రప్రదేశ్ : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీలో కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. రెండు నదుల్లోనూ వరద ప్రవాహం పోటెత్తడంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇప్పటికే 44.9 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పరిస్థితిని అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోకి 9.88 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అదే స్థాయిలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం 11 నుంచి 12 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు కృష్ణానది కూడా పరవళ్లు తొక్కుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద 3.74 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదవుతోంది. రాబోయే గంటల్లో ఇది 4.5 నుంచి 5 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోనూ అధికారులు అప్రమత్తత ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101 ను సంప్రదించాలని తెలిపారు.