ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు నివారణ చర్యల్లో భాగంగా కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై మంగళవారం రాత్రి 7 గంటల నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తుపాను దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సూచించింది.
మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగానికి చేరుకోవచ్చని తెలిపింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రంలో తుపాను ప్రభావంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుపాను తీరానికి సమీపిస్తుండటంతో దాని ప్రభావం ఇప్పటికే కోస్తా జిల్లాలపై మొదలైందని అధికారులు సీఎంకు వివరించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తీర ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత అధికంగా ఉందని తెలిపారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత తుపానుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాను తీరం దాటే కాకినాడ, పరిసర ప్రాంతాలకు జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) బృందాలను వెంటనే పంపాలని ఆదేశించారు. గాలులు, వర్షాల తీవ్రతను ముందుగానే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సీఎంకు తెలిపారు. విశాఖపట్నంతో పాటు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
మరోవైపు, కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమల్లోని పలుచోట్ల 21 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.









