అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ వన్నూరు బి అధ్యక్షతన కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై అధికారులపై కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వార్డు కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా రోడ్డు నిర్మాణ పనులు, నీటి కొళాయి తొలగింపులు చేపడితే ప్రజలకు సమాధానం ఎవరు చెప్పాలని డిఇ హేమచంద్ర పై వైస్ చైర్ పర్సన్ బిందె వరలక్ష్మి, కౌన్సిలర్లు వరదరాజులు, నజీర్ విరుచుకుపడ్డారు. 25 వార్డులో గత మూడు నెలలుగా డ్రైనేజీ వ్యవస్థ, నీటి కొళాయి మరమ్మత్తులు, విద్యుత్ దీపాలను, వీధుల్లో చెత్త తొలగించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతుందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ పుట్ట గుంపుల రాణి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం శిథిలావస్థలో ఉన్నది, నూతన విగ్రహ ఆవిష్కరణ జరగాలని వారు పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో కాళీ ప్రదేశాలలో, రహదారుల ప్రక్కన కంపచెట్లు తొలగించాలని, కుక్కల బెడద, కోతుల బెడద, పందుల బెడద, దోమల నివారణకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. తదన అనంతరం మున్సిపల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు మైనుద్దీన్, మేనేజర్ రాంబాబు, కౌన్సిలర్లు రూతమ్మ, నరేష్, అరవింద్, ఫారుక్, వాల్మీకి శివ,రమణ సానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, టి పి ఓ మారుతి ప్రసాద్,ఆర్ ఓ సతీష్ కమలాకర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










