అనంతపురం (గుత్తి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అనుకూలంగా లేకపోయినా, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు. గుత్తి పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి చర్యలు చేపట్టారని తెలిపారు.
గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా విద్యుత్ రంగాన్ని తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురి చేసి గందరగోళ పరిస్థితులు సృష్టించారని వెంకట శివుడు యాదవ్ ఆరోపించారు. విద్యుత్ అనేది రాజకీయ అస్త్రం కాదని, ప్రజల జీవితాలతో ముడిపడిన అత్యంత కీలక మౌలిక రంగమని పేర్కొన్నారు. అలాంటి రంగాన్ని అవివేకపూరిత నిర్ణయాలతో అప్పుల పాలు చేశారని విమర్శించారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి దాదాపు రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని అన్నారు. కమీషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి కొందరి జేబులు నింపారని, కానీ ప్రజల కడుపు కొట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2019–2024 మధ్యకాలానికి సంబంధించి రూ.4,498 కోట్ల ట్రూఅప్ చార్జీలు వసూలు చేయాలని ఏపీఈఆర్‌సీ (APERC) కూటమి ప్రభుత్వానికి లేఖ రాసిందని తెలిపారు. అయితే ఈ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని వెంకట శివుడు యాదవ్ కొనియాడారు.
అంతేకాకుండా ట్రూ డౌన్ అమలుతో యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. జగన్ పాలనలో ఆక్వా రైతుల నుంచి యూనిట్‌కు రూ.3.50 వసూలు చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని యూనిట్‌కు రూ.1.50కి తగ్గిస్తూ రైతులకు భారీ ఊరట కల్పించిందన్నారు.
ఇక విద్యుత్ కొనుగోలు విషయానికొస్తే, గత ప్రభుత్వంలో యూనిట్‌కు రూ.5.19 చెల్లించగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యూనిట్‌కు రూ.4.70కే విద్యుత్ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఇది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు నిదర్శనమని అన్నారు.
సోలార్ పవర్‌ను ప్రోత్సహించే దిశగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌లు అందించనున్నట్లు, అలాగే బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రూ.20 వేల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని వెంకట శివుడు యాదవ్ తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడమే కాకుండా, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.









