అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో జాతీయ రహదారి నెంబర్–44 ప్రక్కన వెలసిన మహిమాన్వితమైన బాట సుంకలమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం టెంకాయల విక్రయానికి సంబంధించి వార్షిక బహిరంగ వేలంపాటను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు శ్రీపతి నాయుడు, రంగస్వామి నాయుడు, నరసింహులు, వెంకటరాముడు సమక్షంలో సాగింది.
వేలంలో పాల్గొనేందుకు రూ.500 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి సుమారు 19 మంది పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన వేలంపాటలో వన్నెదొడ్డి గ్రామానికి చెందిన మద్దయ్య రూ.46.30 లక్షల అత్యధిక ధరకు టెంకాయల విక్రయ హక్కులను దక్కించుకున్నారు. గత సంవత్సరం ఈ వేలం రూ.35.60 లక్షలకు ముగియగా, 2026 సంవత్సరానికి దాదాపు రూ.11 లక్షల మేర అధిక ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఈ బహిరంగ వేలంపాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, వేలం ద్వారా వచ్చిన ఆర్థిక వనరులను ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని వారు పేర్కొన్నారు.
వేలంపాట సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ రామారావు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ థామస్ డానీ, హెడ్ కానిస్టేబుల్ హనుమంతు, చంద్రతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే ఆలయ కమిటీ సభ్యులు కే. వెంకట్ నాయుడు, కే. గురప్ప తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భారీగా సమకూరిన ఆదాయంతో ఆలయ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.









