వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలపై కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆదివారం రథసప్తమి సూర్య జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ నరేందర్ పర్యవేక్షణలో తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి.
ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ వాహనాలపై అధిష్టింపజేసి మాడ వీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణుడిగా, హనుమంత, గరుడ, గజ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రత్యేకంగా ముత్యాల పందిరి వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకలను తిలకించేందుకు వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా, పొరుగు ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.









