అనంతపురం: నేరాలకు పాల్పడుతూ పాత పంథానే కొనసాగిస్తే చట్టం ఎంత కఠినంగా స్పందిస్తుందో గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఐపీఎస్ హెచ్చరించారు. బౌండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడిన రౌడీషీటర్‌పై గుత్తి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారని తెలిపారు.
గుత్తి మండలం, గుత్తి టౌన్‌కు చెందిన మాతంగి రాము (42), తండ్రి: లేట్ ఎల్లప్ప అనే వ్యక్తిపై రౌడీషీట్ ఉంది. ఇతడు 2020 నుంచి ఇప్పటివరకు మొత్తం 9 నేరాలకు పాల్పడ్డాడు. ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందనే అనుమానంతో ముందస్తు చర్యలలో భాగంగా గుత్తి మండల తహశీల్దార్ ముందు బౌండోవర్ చేయించి, రూ.1,00,000 విలువైన ష్యూరిటీ బాండ్లు తీసుకున్నారు.
అయితే, బౌండోవర్ చేసినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. గత ఏడాది మళ్లీ మూడు నేరాలకు పాల్పడ్డాడు (క్రైం నంబర్లు 32/2025, 61/2025, 225/2025). ఈ నేపథ్యంలో గుత్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామారావు, గుత్తి మండల తహశీల్దార్‌కు లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మాతంగి రాము నుంచి బౌండోవర్ ష్యూరిటీ అమౌంటును కట్టించేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
“బౌండోవర్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజా శాంతిని భంగం చేసే వారిపై పోలీస్ శాఖ ఎలాంటి సహనం చూపదు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే చట్టంలోని గరిష్ట శిక్షలను కూడా అమలు చేస్తాం” అని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా, నిష్పక్షపాతంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజా శాంతి భద్రతలను భంగం చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నేరాలకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పునరుద్ఘాటించారు.








